20 డిసెం, 2011

మా ..రాజన్న



రాజన్న అయ్య శిష్యుడు..
నరాల రామారెడ్డి ..,

రాజన్న.. 
అయ్యను గురువుదేవుడని 
ప్రతి సభావేదిక పైనా స్తుతించేవారు.


రాజన్న కవి.. గాయకుడు..
వసు చరిత్ర పద్యాలను 

కమ్మగా పాడేవాడు..
అతని గొంతులో పద్యాలు కొత్త అందాలను సంతరించుకొనేవి..
నరాల రామారెడ్డి

చక్కని రూపం..

కమ్మటి కంఠం..
 


గూగుల్లో రాజన్న కవి ఫొటో లేదు..
జమ్మలమడక మాధవ రాయ శర్మ గారిదీ లేదు..                                                
నాకు చాలా నిరాశ కలిగింది..
జనాలు మంచి వారిని 
ఇలా మరిచి పోతున్నారేమిటా 
అని బాధ ..

C.V.సుబ్బన్నా కవే..
అయ్యంటే సరిపోదని అనేవారు..
గాయకుడని కవులు వదిలేస్తారు..
కవి అని గాయకులొదిలేస్తారు..
ఇలా రెండు విధాలా 

బ్రతికి పోతున్నాడు రాజన్న అనేవాడాయన..

కవుల మధ్య 

ఈ మత్సరాలెందుకో నాకు అర్థం కాదు..
కానీ రాజన్నను 

నా చిన్నతనం నుంచీ చూస్తున్నాను..
పైన అయ్యతో మాట్లాడి కిందకి వచ్చి 

అమ్మతో మాతో కూడా చక్కగా మాట్లాడే వాడు..
ఇప్పుడు రాజన్న లేడు...
మనసులో  ఏదో బాధ..
నరాల రామారెడ్డి కూడా 
మాకు బాగా పరిచయం 
అష్టావధానాలు ఎంత బాగా చేసే వాడో..
రాజన్న నరాల రామారెడ్డి 

అయ్య శిష్యుల మనే వారు..
పంచకావ్యాలు చదివారు..
నరాల రామా రెడ్డి కార్తీక దీపం
 సినిమాలో ఒక పాట రాసాడు..
అయ్యకు శిష్యులంటే వల్లమాలిన వాత్సల్యం..


శ్రీ S.రాజన్నకవి..

ఒక గాంధర్వ కళా తపస్వి భువిపై .., నుల్లాసియై డిగ్గి..,దే
వకథా మర్మములన్నియుందెలిసి..,భావస్నిగ్ధుడై .. పల్కు గా..
యకుడై..,నాట్య రసజ్ఞుడై..,యారాధ్య శౌండీర్యుడై..
సుకవీంద్రుండగు పుట్టపర్తి గురుపూజ్యున్ గొల్తు భక్త్యున్నతిన్..

చనువో..భక్తియో..! పారవశ్యమో..!మరె సారస్వతా కాంక్షయో..!
ఘనమౌ నీ కవితా రసమ్ము మది సోకన్ హర్ష పూరమ్ములో..
మునకల్ వైచెదనోయి..! రమ్య కవితా మూర్దన్య..! నీ కీర్తి నెం..
తని వర్ణింతును పుట్టపర్తి గురుదేవా..! భవ్య వాగ్వైభవా..!!

విధి రమణీస్మితాతిగము విభ్రమమున్ బెనవైచుకొన్న నీ..
పదియును నాల్గుభాషల యపార పరిశ్రమ తెల్గు నేలలో ..
సదమల చంద్రికా ధవళ చర్చితమైనది.. కావ్య మోహినీ ..
మధుర దృగంబుజాత పరిమార్గిత సత్కవి లోక తల్లజా..!!

రచియింతువో..! భక్తి రక్తి స్పృహా దీప్తి..
కవిరాజు శ్రీనాధ కమ్ర ఫణితి..
రచియింతువో..! మా ప్రబంధ కవీంద్ర సౌం..
దర్య భావాల మాధుర్యలీల..
పలికింతువో..!! నాటి వాగ్గేయ కారుల ..
కిన్నరీ బృంద సంగీత రీతి..
నడిపింతువో ..! యుపన్యాస భంగిమ తుంగ ..
భద్రా సముత్తుంగ భంగ భంగి..!!
సర్వ కవులు నీలోన సాక్షాత్కరింత్రు..
నేను నేనని ప్రతిభా ప్రణీత మతులు..
ముగ్ధ హృదయ ..! పద్మశ్రీ విభూష..!! పుట్ట
పర్తి గురుదేవ..! సూక్తి పుంభావ మూర్తి..!!

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి