11 డిసెం, 2011

పుట్టపర్తికి స్మృత్యంజలి

వాహినీ పిక్చర్స్ అధినేత B.N.రెడ్డి..
మల్లీశ్వరి,మిస్సమ్మ,గుణసుందరికథ,వందేమాతరం,పూజాఫలం,బంగారుపాప,రంగులరాట్నం ,రాజమకుటం,పెళ్ళిచేసి చూడు,పూజాఫలం..ఇలా యెన్నో తీసారు..
అప్పుడు ఆయన అంత పెద్ద వాడు కాదు. అప్పుడప్పుడూ అయ్యగారిని కలిసే వా..
అయ్యగారూ.. అని సంబోధించేవారు.
తులజక్కయ్య వయసు పదిహేనేళ్ళు అయ్యకు ఆమె వ్రాయసగత్తె.
రాయలనాటి రసికతా జీవనము..షాజీ.. సిపాయిపితూరీ.. ఎన్నో అయ్య డిక్టేట్ చేస్తూండగా రాసిందామె.
ఆమె మాటల్లో ఒక సినిమా ప్రొడ్యూసరు ఇంటికి వచ్చేవాడు..
ఆయన అయ్యకు మహారధి కర్ణ అనే సినిమాకు వ్రాయమన్నారు.
కానీ అయ్య సినిమాకు వీలైన స్క్రిప్ట్ వ్రాయలేదు.  అందుకే అది సినిమా రూపం దాల్చలేదు..
ఆ B.N.రెడ్డి గారి అభిప్రాయం ఆయన మాటల్లో నే..


పుట్టపర్తికి స్మృత్యంజలి
 
ఏకాంతమునయందు..
నెన్నినాళులనుండి
పాడుకొనుచున్నదో తానూ..! వాల్మీకి
రామాయణమునంతానూ..! చెవియొగ్గి
వినవయ్య వాల్మీకి విశదహృదయముబోలు..
జాహ్నవీ వేదనా శబలితము రామకథ......



                      
 
                 




   

 
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు  మహోన్నతమైన సాహిత్య కృషీవలుడు.
సాహిత్య క్షేత్రంలో 
వివిధ ప్రక్రియలను చేపట్టి 
సాహిత్యాన్ని సుసంపన్నం చేసి 
మనకొక వారసత్వాన్ని విడిచిపెట్టి పోయాడు. చవకబారు ప్రచారాలకు 
ప్రలోభాలకు వశం కాకుండా
 స్వతంత్రుడై కర్మ యోగిగా.. జీవించాడు..
శ్రీ పుట్టపర్తి మరణంతో 
తెలుగు సాహిత్య చరిత్రలో పాతతరం అంతరించింది.
విశ్వనాధకు సమ ఉజ్జీ.. 
అయి ఆయన తర్వాత ఆ తరానికి అంతే సత్తాతో .. 
అంతే స్థాయితో పుట్టపర్తి ప్రతినిధిగా నిలిచాడు.
అయితే ఆయనలో 
అంతా పాతదనమే అని చెప్పడం సత్యం కాదు.. సౌమ్యమైన ఆధునికతకు నిలిచిన భావుకుడు ఆయన.

చందోబధ్ధమైన పద్యాన్ని 
ఎంత పకడ్బందీగా నడిపాడో 
మాత్రాచ్చంధస్సుతో కూడిన గేయాన్ని కూడా
అంతే సమర్థవంతంగా నిర్వహించాడు.
వారి పండరీ భాగవతం 
జనప్రియ రామాయణం 
శ్రీనివాస ప్రబంధం 
ఎంత గొప్ప సంప్రదాయ బధ్ధమైన కావ్యాలో మేఘదూతం 
అగ్నివీణ 
ఇంగ్లీషులో Leaves in the Wind
 సమకాలీన సామాజిక జీవనానికి 
అంతే ప్రతిబింబాలు.
ఆయన కమనీయ కృతి 
"శివతాండవం"పై వాటిలో చేరని ఒక విశిష్ట రచన. 
దాని కదే సాటి. 
తెలుగు జాతి ఆయనకు ఎంతో ఋణపడి వుంది.

పుట్టపర్తి పద్య గేయ కవియే కాదు 
వచనకవి కూడా..
ఆయన రచనా వైవిధ్యంలో 
వచనాన్ని కూడా కవితవలె కళగా తీర్చి దిద్దినాడు.
"గద్య పద్యముల భిన్నత" 
అనే వ్యాసంలో గద్యానికి పద్యంతో 
సమానంగా పట్టం కట్టాడాయన.


'కవికి ధ్వనియు ఆవేశము ముఖ్యములు. 
వచనమున కౌచితి జీవగర్ర... 
గద్యమునకు స్పష్టత జీవధర్మం...
వచన రచయితకు సర్వతో ముఖ దృష్టి అత్యవసరం...కవికీయున్న మంచిదే..
లేకున్ననూ పెద్ద కొరతగా కానపడి 
కళను వికారంగా మార్చదు.
కనుక యీ రెండును విభిన్నములగు కళలు. 
అట్లే సృష్టించు వ్యక్తులు కూడా భిన్నులే...


పుట్టపర్తి కవితా స్పూర్తి ఎంత గొప్పదంటే.. 
ప్రాచీన కవితాభిమానులు సరే 
ఆయనను తలకెత్తుకున్నారు. 
కానీ శ్రీ శ్రీ అంతటి వాడు కూడా 
ఆయన "జనప్రియ రామాయణాన్ని" చూసి 
విస్మయం చెంది 
"నాకు రామాయణ భారతాలంటే సరిపోదు 
కానీ 
ఈ రచనను చూస్తే యేమో చదువుదామనిపిస్తూంది"
అని అంటాడు.

పుట్టపర్తి మానవతామూర్తి. సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకు చమటోడ్చి చింపిరి గుడ్డలతో వున్న ఒక పాటక యువతిలోని అందాన్ని చూసి "నిన్ను సంపన్నురాలుగా చూడాలని కోరుకుంటాను" అన్నాడు.


"My heart longs to see you in riches
God is unfair,wealth is only for some"

(Leaves in the Wind)


దుమ్ములో పొర్లాడుతూ 
మృత్యువాత పడిన ఒక గాడిదను చూసి 
పసిపిల్లలు దాన్ని చుట్టుముట్టి 
దాని శవంపై దయాదృష్టి ప్రసరిస్తూ వుండగా..  
ఒక పెద్దమనిషి 
ఆ దృశ్యాన్ని చూచి 
"గాడిదనేగా..! చావనీ.. 
కొన్ని గాడిదలు (మరుజన్మలో) 
మనుషులుగా పుట్టవచ్చు." అని అంటాడు 
అదే ఆంగ్ల కవితలో...
సమాజంపై ఎంతటి కొరడా దెబ్బ కొట్టాడు..! 
ప్రేమ ఒకటే నిజమైన వేదాంతమంటాడు ఈ కవి.
ప్రేమను ఎవరూ బలవంతంగా అనుభవింపచేయజాలరు.
అది సహజమైనది.వేదాంతమూ అంతే.
నన్ను నేను ప్రేమిస్తాను. 
ప్రతిమనిషిలో నన్ను చూచుకుంటాను.
అప్పుడు నేను 
వేయి మంది దేశభక్తులతో సమానుడనవుతాను" అంటాడు ఆయన
చక్రవర్తి కుమారుడైన గౌతమబుధ్ధుని 
త్యాగ శీలాన్ని ఆయన కొనియాడారు. 
రాజభోగాలను వీడి 
'ఆత్మక్షుత్తు' తో (Hunger of Soul) 
సత్యాన్వేషణకు బయలుదేరి 
వర్షాకాలం మేఘమువలె 
మానవజాతిపై కృపావర్షం కురిపించడానికి 
తిరిగి వచ్చాడు బుధ్ధుడు అంటాడు. 
సన్యాసియైనా మహాదాత 
అని బుధ్ధుని అభివర్ణిస్తాడు.

పుట్టపర్తి గొప్ప ఆస్తికుడు.
భక్తాగ్రేసరుడు.జన్మతో వైష్ణవుడు.
విశిష్టాద్వైతములను ఉపాసించకూడదనే 
ఆ మత సిధ్ధాంతాన్ని త్రోసిరాజన్నాడు. 
హరిహరులు ఆయనకు అభేదము.
వైష్ణవుడై శివుని ఆరాధించాడు.

అంతేకాదు 
హిందూమతములో వర్గవిభేదాలను అధిగమించి 
అందరి దేవుళ్ళలో పరమాత్మను దర్శించి 
పూజించాడు.

అన్ని ప్రాంతాల్లోని భక్తి సిధ్ధంతాలను ఆదరించాడు.
సమర్థ రామదాసు.. 
చైతన్యప్రభు.. 
తులసీదాసు.. 
శివానంద సరస్వతి.. 
రమణ మహర్షి.. 
అరవిందుడు.. 
షిర్డి సాయిబాబాతో సహా 
అన్ని తత్వాలను అవగాహన చేసుకొని 
వాటిని అనుసరించాడు. 
బౌధ్ధమును జైనమును కూడా ప్రశంసించాడు.
ఇదీ పుట్టపర్తివారి వ్యక్తిత్వం విశిష్టత. 
ఆయన సాహిత్య విశ్వరూపాన్ని
 స్వరూపాన్ని స్మరించుకొని 
వినమ్రు డనై ఆయనకు నమస్కరిస్తాను.