31 జులై, 2012

ప్రాకృత కవిత




పూర్వం 
భారత దేశంలో చదువుకున్నవారు 
సంస్కృత బాషలో, 
చదువురానివారు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
చదువుకున్నవారు కూడా కొన్ని సార్లు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
కొన్ని గ్రంథాలు ప్రాకృత బాషలలో వ్రాసారు. 

ప్రాచీన ప్రాకృత బాషలలో ముఖ్యమైనది 
'పాళీ బాష. 
స్థవీరవాది బౌద్ధులు, 
హీనయాన బౌద్ధులు 
ఈ బాషని పవిత్ర బాషగా భావిస్తారు. 

జైన మతానికి చెందిన కొన్ని గ్రంథాలని 
అర్థ-మాగధి అనే ప్రాకృత బాషలో 
రచించడం జరిగింది. 

మతంతో సంబంధం లేని 
కొన్ని గ్రంథాలని కూడా 
ప్రాకృత బాషలలో రచించడం జరిగింది. 
అందులో హాలుడు రచించిన 
'గాథాసప్తశతీ ఒకటి. 

ప్రాకృత బాషలలో కథలు, 
పౌరాణిక కావ్యాలు కూడా ఉండేవి. 
వీటిలో 
'పైశాచీ' మాండలికంలో వ్రాసిన 
గుణాఢ్యుని 'బృహత్కథా, 
ప్రవరసేనుని 'సేథుబంధం' ముఖ్యమైనవి. 

అప్పట్లో 'అపభ్రంశం' 
అనే ప్రాకృత బాషలో కూడా సాహిత్యం ఉండేది. 
ప్రాకృత బాషలు ఎన్ని ఉన్నా 
సంస్కృత బాష ప్రధాన 
సాహిత్య బాషగా ఉండేది.


ఈ ప్రాకృత వ్యాసాలను అక్కయ్య 
నాగపద్మిని ముద్రించింది.
ఇందులో ..
 
ప్రాకృత కవిత
సేతుబంధము
సావయధమ్మదుహా
జసహర చరివు
కొన్ని సప్త శతులు
సంస్కృత నాటకాలలోని ప్రాకృతం
 
 అన్న వ్యాసాలున్నాయి
మొదటిదైన ప్రాకృత కవితను
మనమిప్పుడు  చూద్దాం..

ఇందులోని..
"జహరసియ సింగాయి ..ఉధ్ధరియ కందాయి.. "
అని అయ్య తాళం వేస్తూ ఊగిపోతూ చిరునవ్వుతో చెప్పడం ఎంత తీపి గుర్తో..
అది ఊరిదేవతల జాతరలలో పోతరాజును వర్ణనార్భాటము.















జాడతెలియని నిధి -పుట్టపర్తి అనూరాధ






ఎవరంటారు జన్మ చేత 
సంస్కారాలు నిర్ణయింపబడతాయని..
ఇదిగో ఇది చూడండి

పుట్టపర్తి వారి చిన్నతనంలో 
నేసేరాముడుండేవాడు
అతని వృత్తి మగ్గం నేయటం
ప్రవృత్తి మహోన్నతం
ప్రబంధాలు అన్నీ నాలుకపైనే
 

ఉత్తర రామాయణమంటే ప్రాణం
రాత్రికి బాగా తాగి మత్తులో జోగుతున్న్నా
అతని నాలుకపై రాముడు నాట్యం చేసేవాడు..
ఎన్నో పద్యాలు .. శ్లోకాలు ..
 

పుట్టపర్తి వారు అప్పటికి చిన్న పిల్లాడు..
అతని దగ్గర కూచుని 
ఎన్నో తెలియని విషయాలు 
అడిగి తెలుసుకొనేవాడు.
 

ఇలా 
ఆ ధార పుట్టపర్తి వారి చిన్నతనాన్ని 
ముచ్చటగా స్పృశించింది..
 

"లత" మాస పత్రిక..
గుంటూరు మోహన వంశి లతగారి 

సంపాదకత్వంలో  వచ్చేది.
అర్ధాంతరంగా ఆగిపోయింది.
 

అందులో ..
పుట్టపర్తి వారు 
జీవితం అనుభవాలు శీర్షికన 
ఎన్నో విషయాలు వ్రాసేవారు.
 

వారి కలం వెంట వారి జీవితం 
ఎంతో రమణీయంగా  వ్యాఖ్యానింపబడేది.
 

కొన్ని మాసాలు ధారావాహికంగా సాగిన 
ఆ జ్ఞాపకాల తలపోత ..
అకస్మాత్తుగా ఆగిపోయింది.
అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.
 

వచ్చిన ఆ సంచికలన్నీ 
తన పొత్తిళ్ళలో జాగ్రత్తగా దాచుకున్న 
శ్రీశైలం గారు..
పుట్టపర్తి వారు చెప్పిన మీదట
పుట్టపర్తి వారిపై Phd చేస్తానని వచ్చిన
 
సోమలింగా రె డ్డి  నే ధూర్తునికి
ఆ లత మాస పత్రికలు  ఇచ్చారు .
 

 ఎంతో అయిష్టంగా..
కన్నబిడ్డను అప్పజెపుతున్నట్లు 
తాను జాగ్రత్తగా దాచుకున్న ఆ ప్రతులను
అతనికి అప్పజెప్పారు శ్రీశైలం.
 
కానీ అతను..
అయ్య పై రిసెర్చ్ ఏమో కానీ 
ఆప్రతులను పోగొట్టాడు.
ఆరోజులలో జిరాక్స్ సౌకర్యం లేని కారణాన 
ఇంకో ప్రతి కూడా లేని పరిస్తితి ఏర్పడింది.
 

నేను ఇచ్చేసాననీ ఒకసారి ..
పోస్టులో పంపానని మరోసారి..
నోటికి వచ్చిన మాటలు చెబుతూ 
బుకాయించాడు సోమలింగా  రె డ్డి .
 

చేసే విషయంపై శ్రధ్ధ లేని వారు.
ఏదో వృత్తిలో ఉన్నతి కోసం 
Phd  మొక్కుబడిగా చేసే వాని చేతికి 
ఆప్రతులు వెళ్ళడం
మన దురదృష్టం.
 

అక్కిరాజు రమాపతి రాజు గారు
తెలుగు జాతి దురదృష్టం 
ఆ ప్రతులను కోల్పోవటం అన్నారు ఆవేదనగా..
 

ఇది జరిగి ఎన్నో ఏళ్ళయినా 
శ్రీశైలం గారి కన్నుల్లో సన్నని తడి .. 
సోమలింగా  రె డ్డి  అబధ్ధం చెప్పాడు 
అనే ఆయన వగపు వెనుక 
తెలియని ఏదో బాధ్యత ఆయన్ను కలచివేస్తుందని
ఆయనతో కాసేపు మాట్లాడితే 
వెంటనే మనకు అర్థమౌతుంది.
 
చివరకు ..
సోమలింగారె డ్డి  
చరిత్ర హీనుడి గా మిగిలిపోయాడు.
 

ఎవరైనా ..
అప్పటి లత మాసపత్రికలు దాచినవారు..
ఆ అమూల్యనిధిని మాకు అందజేస్తే..
వారికి జీవితాంతం ఋణపడి వుంటామని
పత్రికాముఖంగా..
కాదు..కాదు ..
 బ్లాగ్ముఖంగా ..
 తెలియజేస్తున్నాను..


నా ID anu_radha373@yahoo.com

29 జులై, 2012

ఓ రసావేశ ఝరి పుట్టపర్తి - నరాల రామారెడ్డి శతావధాని ప్రొద్దుటూరు.



                                          నారాయణుని శివత్వం..


ఏమానందము.. 
భూమీతలమున
శివతాండవమట..!
 శివలాస్యంబట..!
తలపైని చదలేటి యలలు తాండవమాడ..
అలల త్రోపుడుల క్రొన్నెరపూవు కదలాడ..
మొనసి ఫాలముపైన ముంగురులు చెఋఅలాడ..
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ..
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప..
కనుచూపులను తరుణ కౌతుకము చుంబింప..
కడగి మూడవకంట గటిక నిప్పులు రాల..
కడుబేర్చి పెదవిపై కటిక నవ్వులు వ్రేల..
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ..
నమిత సమ్రంభ హాహాకారములు రేగ..
ఆడెనమ్మా శివుడు..
పాడెనమ్మా భవుడు..

             
 
               పెనుగొండ ఆణిముత్యం

ఎట్లు పైకెత్తిరో..?
 యేను  గు గున్నలకైన
తలదిమ్ము గొలుపు నీ శిలల బరువు..
యేరీతి మలిచిరో యీ స్తంభముల యందు..
ప్రోవుగ్రమ్మిన మల్లెపూల చాలు..
యేలేపనంబున నీకుడ్యములకెల్ల..
దనరించినారో యుధ్ధాల తళుకు..
ఏ యంత్రమున వెలయించిరో వీనికి..
చెడక యుండెడు చిరంజీవశక్తి..
కనివిని యెౠంగనట్టి దుర్ఘటములైన..
పనులు స్వాభావికము నుండినట్టి వారి
కా మహాశక్తి యేరీతి యబ్బెనొక్కో..
కాలమో జీవనమొ..
యేదో కారణంబు..
   
 నరాల రామారెడ్డి..
అయ్య శిష్యుడు..
అవధానాలు చేసేవాడు..
ఆయనతో కొన్ని వేదికలపై నేనూ పాల్గొన్నాను.
అది పెద్ద చెప్పవలసిన విషయం కాదు.
 

రాజన్న 
రామారెడ్డి ప్రతి సభలోనూ 
అయ్య ను గురువుగా స్తుతించేవారు.
పుట్టపర్తి వారి తొలి నాళ్ళను 
దగ్గరినుంచీ గమనించిన వారు.

మహాపురుషులు 
వేలల్లో  లక్షల్లోవుండరు
కేవలం ..
వేళ్ళమీద లెక్కించగలిగేలా వుంటారు..
వారిని కారణ జన్ములంటారు
 

ఒక్కొక్కరి జీవితం పరిశీలించినప్పుడు..
వారు కేవలం కర్మ అనుభవించడంకోసం 

పుట్టినవారు అనిపించరు..
సుస్పష్టంగా కనిపిస్తుంది.

భగవద్గీత వంటివి ఎన్ని సృష్టించినా ..
కృష్ణపరమాత్మగా ఎన్ని లీలలు చేసినా..
వీరు నా దారిని రావటం లేదని..
కొందరు మహాత్ములను సృష్టించి..
ఆయన తన జీవన విధానం ద్వారా కూడా 

మనకు పాఠాలు నేర్పాలని చూస్తాడు.

అయ్య ఉన్న ఒక్క జీవితాన్ని 
సద్వినియోగం చేసుకొని 
ధన్య జీవి అయ్యారు.
మనం తిరిగి అంతటి మనిషిని చూడగలమా..
 




                  ఓ రసావేశ ఝరి పుట్టపర్తి
      నరాల రామారెడ్డి, శతావధాని, ప్రొద్దుటూరు.
                 సాక్షి 29.3.2010 ఆదివారం
               సహకారం రామావఝ్ఝుల శ్రీశైలం
మహాకవి 
సరస్వతీపుత్ర పద్మశ్రీ వారికి 
లోకం సమర్పించుకున్న బిరుదులు.
 

విలక్షణ వ్యక్తిత్వం 
విశిష్ట వైదుష్యం 
విశృంఖల సంభాషణా చాతుర్యం 
తేరిపార చూడలెనంతటి తేజస్సు 
వారిలో జనం గుర్తించిన వైదుష్యాలు. 

కవి 
వక్త 
విమర్శకులు. 
అనువాదకుడు 
వాగ్గేయకారుడు 
బహుభాషాకోవిదుడు
వారికి ప్రజలు పెట్టికున్న పేర్లు.
 

ఆయన కావ్యాలను గురించి చెప్పవలసి వస్తే 
రమ్య కవితా రశ్మి 
హృదయ నైవేద్యం 
రసావేశ జలపతం 
కమనీయ కవితా కాసారం 
అభ్యుదయ భావనాగీతం 
లాంటి మాటల మూటలు దొర్లుకొస్తాయి. 

తాను రచించిన కావ్యాన్నే 
తాను చదివి పరీక్ష రాసిన కవి 
ప్రపంచంలో 
పుట్టపర్తి నారాయణాచార్యులు తప్ప 
ఇంకెవరున్నారు..?
 

విలక్షణ వ్యక్తిత్వంతో 
విశిష్ట వైదుష్యంతో 
విశృంఖల సంభాషణా చాతుర్యంతో 
తేరిపార చూడలేనంతటి తేజస్కుడుగా 
ఆంధ్ర సాహితీ  క్షేత్రంలో  ప్రజ్వలించారు 

పుట్టపర్తి కవిగా 
వక్తగా 
విమర్శకుడుగా 
అనువాదకుడుగా 
వాగ్గేయకారుడుగా 
అనేక రంగాల్లో 
అసాధారణ ప్రతిభా పాటవాలను 
ప్రదర్శించారాయన 

పన్నెండేళ్ళ పసి వయసులోనే
పరిణితి పొందిన ప్రతిభను ప్రదర్శించి
 చారిత్రక ప్రదేశంగా 
ప్రఖ్యాతమైన పెనుగొండ క్షేత్రాన్ని 
పెనుగొంద్డ లక్ష్మి కావ్యంగా తీర్చిదిద్దారు. 

సంస్కృత సా హిత్యంలో 
అమరుక మహాకవి రచించిన 
అమరుక శతకాన్ని
"ఏకః శ్లోకః ప్రబంధ శతాయతే.."
 అని విమర్శకులు ప్రశంసించారు. 
అలాగే 
నారాయణాచార్యుల పెనుగొండలక్ష్మి లో 
ఒక్కొక్క పద్యం 
ఒక్కొక్క ఆణిముత్యం. 

అంత చిన్నప్రాయంలో 
నారాయణాచార్యులు 
ఇంత ప్రౌఢ కావ్యం రచించడం అధ్భుతం. 

వారు ఉద్యోగం కోసం 
విద్వాన్ పరీక్షకు వెళ్ళినప్పుడు 
పెనుగొండలక్ష్మి పాఠ్యభాగంగా ఉండిందట. 
తాను రచించిన కావ్యాన్నే 
తాను చదివి పరీక్ష రాసిన కవి 
ప్రపంచంలో 
నారాయణాచార్యులు కాక 
ఇంకెవరున్నారు..?
 

రమ్య కవితా రశ్మి.
పెనుగొండలక్ష్మి రచన 

ప్రముఖ విమర్శకులు 
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
వంటి మహనీయుల ప్రశంసలు పొందింది. 
"ఉలిచే రాళ్ళకు చక్కిలింతలిడి.."
 వంటి అపురూపమైన పద చిత్రాలకు 
రాళ్ళపల్లివారు మురిసిపోయారు. 

ఒకనాడు..
కృష్ణరాయల ప్రాభవానికి పట్టం కట్టిన ప్రాంతం 
ఆంధ్ర శిల్పుల ధిషణా వైభవానికి 
అద్దం పట్టిన క్షేత్రం 
 ఈనాడు కాలపురుషుని 
 కర్కశపాద ఘాతానికి శిధిలమైపోయిన 
దారుణ దృశ్యాన్ని భరించలేక 
బాల నారాయణాచార్యుల హృదయంలో 
ఉప్పొంగిన ఉధృతమైన ఆవేశం 
పద్య ఖండికలుగా ప్రవహించిం ది. 

12 సంవత్సరాల బాలుడు 
ఇంత గొప్ప పద్యం 
ఎలా రచించాడో. .?
హృదయ నైవేద్యం 

పాద్యం
నారాయణాచార్యులు రచించిన 

భక్త రస ప్లావితమైన పాద్యం గొప్ప కావ్యం .  
ఇదొక్కటే చాలు ..
నిజానికి ..
దీనిలో ఒక్క పద్యమే చాలు..
నారాయణాచార్యులను 
కవిగా నిలబెట్టడానికి 
అన్నారు..
ప్రముఖ విమర్శకులు 
తిరుమల రామచంద్ర గారు. 

రవీంద్ర కవీంద్రుని గీతాంజలి గా 
పుట్టపర్తి వారి పాద్యం 
భగవంతునికి సమర్పించుకొన్న
 హృదయ నైవేద్యం 
అని చెప్పవచ్చు 

భగవంతుని సాన్నిధ్యం కోసం 
పరితపించిన నారాయణాచార్యులు 
గోవుగా పుట్టి వుంటే బాగుండును 
గోపాలకృష్ణుని లాలన భాగ్యం లభించేది 

ఎందుకయ్యా..?
మనుష్యజన్మ నా నెత్తిమీద రుద్దినావు..?
అని దేవుని మీద కోపగించుకొన్నారు.
రసావేశ జలపాతం
నారాయణాచార్యుల రచనల్లో 
శివతాండవ గేయకావ్యం 
ఆంధ్ర దేశంలోనే కాదు 
భారతదేశంలోనే బహుళ ప్రచారం పొందింది. 

కేవలం ఆంధ్రులేకాదు 
ఇతర భాషల వాళ్ళు కూడా 
శివతాండవ రచన లోని 
శబ్ద సమ్మేళనానికి పరవశించి 
మా భాషల్లో కూడా అనువదించండి 
అని కోరినారట 

ఎన్నో వందల వేదికల మీద 
పుట్టపర్తి వారు 
ఉధృతమైన ఆవేశంతో గానం చేస్తుంటే 
ప్రేక్షకులు ముగ్ధులైపోయేవారు. 
ఏమానందము భూమీతలమున 
అని ఆరంభమయ్యే శివతాండవం 
ఎన్నో అభినయాలతో 
ఆంగిక విన్యాసాలతో 
ఉధృత జలపాతంలా దూకుతుంది. 

నారాయణాచార్యులు ఏ సభకు వెళ్ళినా 
శివతాండవ గానం చేయక తప్పదు 
ఎన్నో నారాయణాచార్యుల సభల్లో 
పాల్గొన్న ఈ వ్యాసకర్త 
ప్రేక్షకుల కోసం 
శివతాండవ గానం చేయమని 
అర్థించవలసి వచ్చేది. 

పుట్టపర్తి వారు అంటారు 
"నా రచనల్లో ..
ఈ శివతాండవానికి ఎంత అదృష్టం పట్టిందిరా..?
 జనప్రియ రామాయణం గానం చేద్దామంటే చేయనివ్వరు."
అని
 
కమనీయ కవితా కాసారం
నారాయణాచార్యుల ఆత్మ సంవేదనాగ్నికి 
అద్దం పట్టిన కావ్యం ..
"సాక్షత్కారం .."

మహాకవి తులసీదాస్ జీవితంలోని 
ఉజ్వల ఘట్టం.
ఈ కావ్యంలో ఇతివృత్తం 
తులసీదాసు భార్య పేరు మమతాదేవి 
ఆమె సౌందర్యమెంత లలితమో 
హృదయమంత గంభీరము 
మమతాదేవి కన్నుల నీడలే 
సమస్త ప్రపంచము తులసికి ..!

ఆమెది శరీరంతో సంబంధంలేని 
జ్యోతిర్మయ ప్రేమ..
ఈ రెంటి సంఘర్షణ ఒక్కటే వర్ణింప బడుతుంది 
అంటారు పుట్టపర్తి నారాయణాచార్యులు

 గొప భావుకత్వం ఉన్న కవి.
 కవిత్వమే తపస్సుగా జీవించి..
 మనోజ్ఞమైన భావనాబలంతో 
మన హృదయాలను 
రస లోకాలకు పయనింపజేస్తారు.
 
అభ్యుదయ భావనా గీతం
సంస్కృత సాహిత్యంలో 
సుప్రసిధ్ధమైన మహాకవి కాళిదాసు రచించిన మేఘసందేశం ఇచ్చిన స్పూర్తి తో
 నారాయణాచార్యులు తెలుగులో 
మేఘదూతం రచించారు 

ధనవంతుల దౌర్జన్యానికి గురై
 చెరసాల పాలైన ఒక నిరపరాధి 
తన ప్రియురాలికి 
మేఘంతో పంపిన సందేశం 
మేధదూతంలోని ఇతివృత్తం 

ఈ సందేశంలో పుట్టపర్తి వారు 
ఆంధ్రదేశంలో
 చారిత్రక ప్రాధాన్యం సంతరించుకొన్న 
పుణ్యక్షేతాలను 
శిల్పకళా పదేశాలను
 ఎన్నో స్థలాలను 
ఎన్నో ప్రదేశలలో ప్రజల జీవన విధానాలను
 అందమైన భాషలో 
ఆకర్షణీయంగా 
నిసర్గ రమణీయంగా వర్ణించారు. 

పెనుగొండ నుంచి శ్రీకాకుళం దాకా 
ముఖ్య స్తలాలను మేఘం ద్వారా 
పాఠకునికి పరిచయం చేసారు  పుట్టపర్తి వారు.

 గేయ చందస్సులో సాగిన ఈ కావ్యంలో 
హృదయాన్ని కదిలించే 
ఎన్నో జీవితాలను చిత్రించారు. 
నిరుపేదల బాధల్ని
 ఈ గేయంలో పుట్టపర్తి వర్ణించిన తీరు
 ఆయనలోని 
అభ్యుదయ దృక్పధానికి నిర్దర్శనం 
పేదరాలు 
పాలకోసం ఏడుస్తున్న పసివానికి 
తన చన్నుబాల నిస్తుందా..?
 వక్షస్తలాన్ని చీల్చి రక్తమే త్రాపుతుందా..?

ఇది ధనికులకెలా తెలుస్తుంది..?
అని మేఘం ద్వారా 
సమాజాన్ని పుట్టపర్తి ప్రశ్నించారు. 

తులసీదాసు రామచరిత మానస్ ప్రేరణతో నారాయణాచార్యులు 
తెలుగులో రామకథను 
గేయచ్చందస్సులో 
"జనప్రియ రామాయణాన్ని" రచించారు. 

ఇరవై వేల ద్విపదలతో 
"పండరీభాగవతం "
అనే మహా కావ్యాన్ని రచించినారు
"మహా భారత విమర్శనం "
"భాగవతోపన్యాసాలు "
"ప్రబంధనాయికల" వంటి
ఎన్నో విమర్శనాగ్రంధాలు వెలువరించినారు 
విభిన్న్న రంగాలలో 
అనితరసాధ్యమైన ప్రతిభను పదర్శించిన 
మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులవారికి 
జ్ఞాన పీఠ అ వార్డు రాకపోవడం 
వారి అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించింది. 

రాయలసీమలో పుట్టడం శాపమైంది.
అని వారి అభిమానులు 
నిరాశా నిస్పృహలను ప్రదర్శించడం 
గమనించదగ్గ అంశం.
 
 

25 జులై, 2012

అమ్మ చెప్పిందీ -- పుట్టపర్తి అనూరాధ





అది మధ్యాన్నం..
భోజనాల సమయం..
వేసవి..
మామిడి పళ్ళు ఉన్నాయ్..
రెండే రెండు..
అయ్య వేసవిలో ..
మామిడి పళ్ళు పెరుగన్నం లో కలుపుకుని 
ఎంతో ఇష్టం గా తినే వారు..
అయ్య భొజనానికి వచ్చారు..
వెండి పళ్ళెం ..
అయ్య పెళ్ళప్పుడు మా అవ్వ పెట్టిందనుకుంటా..
చెంబుతో నీళ్ళు..
పక్కనే చేయి తుడుచుకోవటానికి టవలు.
అయ్య వచ్చారు..
అమ్మ అయ్యకు ఒక్కొక్కటీ వడ్డించి..
విసనకర్రతో విసురుతూ కూర్చుంది..
అబ్బ ..
అయ్య నన్నూ కూర్చోమన్నారు..
మామిడి పళ్ళు రెండే వున్నాయ్..
పెద్దది నాకు కావాలన్నాను..
వద్దమ్మా.. 
నీవా చిన్నది తీసుకో..
అంది అమ్మ.
ఊహూ నేను పెద్దదే తీసుకుంటాను..
అప్పుడు వదినకు చిన్నది వస్తుంది..
అయినా అమ్మ మాట వినక నేను 
పెద్ద మామిడి పండే తీసుకున్నాను..
అమ్మ నా వంక ప్రేమగా చూస్తూంది..
పండు కొరకగానే ..
అది మొత్తం పుచ్చినపండు..
నేను అమ్మ వంక చూసాను..
అమ్మ నా వంక చూసి చిరునవ్వు నవ్వింది..
అప్పుడు నాకు పదమూడేళ్ళు..
అంటే ..
నేనర్థం చేసుకున్న దేమిటంటే..
వదినకు యేం ఇవ్వాల్లే 
అని ప్రవర్తించిన నాకు ..
గర్వ భంగం జరిగింది అని..
ఈ సత్యాలన్నీ 
స్పటికంలాగ చక్కగా బోధపడుతూ ఉన్నా కూడా ’నాది’ 
అనే మమకారాన్ని మనిషి వదలడంలేదు. 
మమకారం అనేది 
చర్చించినంత తేలికగా పోదు. 
అహంకారం ఉన్నంతవరకు 
మమకారం దూరం కాదు. 
కనుకనే, 
ఈ ప్రపంచంలో జీవించి యున్నంత కాలం 
 ఏదో కొంత త్యాగం చేస్తూ పోవాలి. 
దానం చేస్తూ ఉండాలి. 
ఇవి చేయడంలో ప్రధానమైన విషయం 
‘సేవ’ కాదు అనే సత్యాన్ని అందరూ గ్రహించలేరు. 
సేవ రెండవ విషయం.  
(గణపతి సచ్చిదానంద)


23 జులై, 2012

కృష్ణ భక్తి- పుట్టపర్తి అనూరాధ



కడప 1 నవంబరు, 1967.                      సంచిక 9
                             
                            సంపాదకీయము. 

శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి ధర్మ ప్రచార పక్ష పత్రిక సంపాదకులు: మహాకవి పుట్టపర్తి


రామోపాసన 
ఆంధ్రదేశమందున్నంతగా 
నితర రాష్ట్రములలో లేదని చెప్పవచ్చును. 
 దానికి కారణము..
రాముడాంధ్ర దేశమునందలి 
యనేక ప్రదేశములలో సంచరించుటయే. 

కేరళ దేశమందు కృష్ణ భక్తికే విశేషమైన వ్యాప్తి. 
 జయదేవుని గీతములకు 
విపులమైన ప్రచారమున్నది.
శాక్తము గూడ నెక్కువ. 

కన్నడములో ద్వైత భక్తులు 
విఠలమూర్తి నెక్కువ ప్రచారముచేసిరి. 
వీరశైవులు శివపరతత్వము బోధించిరి. 

తమిళమునందును 
రామభక్తులు చాలమంది యున్నారు 
బెంగాల్ ఒరిస్సా మొదలగు రాష్ట్రములలో 
కృష్ణ భక్తికే పట్టాభిషేకము. 

సమర్థ రామదాస స్వామి 
మహారాష్ట్రమున రామభక్తిని 
కొంతవరకు ప్రచారమునకు దెచ్చెను 
కాని యాదేశమున 
పాండురంగ భక్తులే ఎక్కువ. 

ఉత్తర హిందూస్తానములోముఖ్యముగా 
కృష్ణ భక్తికి బహుళ వ్యాప్తి దెచ్చినవాడు వల్లభాచార్యుడు..
ఇతడు కృష్ణదేవరాయలకు సమకాలికుడు 
హిందీలో అష్టచాప్ కవులు ప్రసిధ్ధులు 
వీరందరు వల్లభుడు ప్రసాదించినవారే 
భాగవత కర్త సూరదాసు వల్లభుల శిష్యుడు 
మీరా వల్లభుల శిష్యురాలు 

ఈ సంప్రదాయస్తులు 
నారీ వేషములతో నుందురు 
వీరి పీఠములు గుజరాతులో నెక్కువ 
వీరు కృష్ణునకు ప్రతినిధులని 
వారి శిష్యుల విశ్వాసము. 

గురువుల పాద తీర్థమును గూడ గైకొందురు. 
నమలిన తమ్మనల గ్రహించు నాచారమున్నది. 
అంతరంగ సేవయు గలదు 
ఏకాదశి నాడు కూడ తాంబూల సేవన మొనర్తురు. వల్లభుల నానాటి కాశీ పండితులక్షేపించిరి. 

కానీ విశ్వనాధుడే 
వల్లభుడు మహాభక్తుడని సాక్ష్యమిచ్చినాడు.
వల్లభుడు గొప్పపండితుడు 
ఇతని అణుభాష్యము ప్రసిధ్ధమైనది. 
మరికొన్ని గ్రంధములు వీరిపేరనున్నవి. 
వల్లభుడొక అపూర్వ వ్యక్తి. 
సామాన్యుల మనస్సుల కందడు. 

స్వామి నారాయణ మతము వేరొకటి యున్నది. 
వీరును కృష్ణోపాసకులే. 
వల్లభుల మతములోని కొన్ని యాచారములను ఖండించుటకిది మొదలయ్యెను. 
మహానుభావ సంప్రదాయము
మరియొకటి యున్నది. 
దీనిని నిర్మించినవాడు కృష్ణభట్టు. 
ఈ మతస్తులు నల్లని గుడ్డలను గట్టికొందురు. 
వీరు సన్యాసులే కాని క్షౌరము నిషిధ్ధము కాదు. 
కృష్ణ దత్తాత్రేయులను వీరుపాసింతురు. 

కృష్ణ చరితామృతము.. 
లీలానిధి.. 
లీలామృతము ..
అను కొన్ని గ్రంధములు 
వీరి తత్వమును బోధించును. 

హరిదాసు మతమని యొకటున్నది. 
 ఈ సంప్రదాయస్తులు 
బృందావనములో నున్నారు. 
రసిక పదము సాధారణ సిధ్ధాంతము 
మొదలగునవి వీరి గ్రంధములు.
 
"రాధావల్లభ" మతము మరియొకటి 
అక్బరు సమకాలికుడైన హరిదాసు 
ఈ సిధ్ధాంతమును ప్రచారములోనికి దెచ్చెను, బృందావనమందు రాధాకృష్ణులను ప్రతిష్టచేసినదీతడు. 

ఇంద్రియ సుఖమును 
భక్తితో సమన్వయపరచుటకు 
వల్లభాచార్యుడొనర్చిన ప్రయత్నమును 
వీరుగూడ నంగీకరించిరి.
 
హరిదాసు సమాధి 
బృందావనములో గలదు. 
"భక్తిమాల.. జీవదశ ..వేదగానం.."
అని కొన్ని గ్రంధములు వీరివి ఉన్నవి. 

కృష్ణ తత్వమును ప్రతిష్టించిన వారిలో 
నింబార్కుడు ప్రధానుడు 
వారి భాష్యమును 
ఔరంగజేబు నాశనము చేసెను. 
జయదేవుడీ సంప్రదాయమునకు చెందినవాడే 
వీరికి భాగవతము ప్రమాణ గ్రంధము. 
నిబార్క సిధ్ధాంతము ననుసరించువారు 
నేటికిని గోకులము.. బృంద ..
మొదలగు ప్రాంతములలో గలరు 
ఈ మతస్తులు పరమ శాంతులు 
భక్తిలో నాయక నాయకీ భావము ముఖ్యము 

"రత్నమాల.. రత్నమంజరి "
మరికొన్ని గ్రంధములు 
వీరి సంప్రదాయమును బోధించును 
శుకుడే భాగవతమతమను 
నొక సిధ్ధాంతమును ప్రవర్తింపజేసెను. 
శుకమహర్షి వ్రాసిన 
సూత్ర భాష్యము కూడ నొకటి యున్నదట.
"మీరా సంప్రదాయము"
గుజరాతునందెక్కువ ప్రచారములోనున్నది. 
బెంగాలులో చైతన్యుడు కృష్ణ భక్తిని ప్రచారమొనరించెను. 
వీరికి భాగవతము ..భగవద్గీత..
 ప్రమాణ గ్రంధములు 
సాధారణముగా కృష్ణభక్తులను 
ఉత్తర హిందూస్థానములో 
గోస్వాములని వ్యవహరింతురు

రూపగోస్వామిప్రసిధ్ధుడైన రచయిత 
ఆలంకారికుడు. 
కృష్ణ మతమును ప్రచారమొనర్చిన 
మఠములెన్నియో బింగాలు దేశమున గలవు.
 
కృష్ణుడెంత చిత్ర పురుషుడో 
కృష్ణ భక్తియునంత చిత్రమైనది. 
దాని నర్థము చేసుకొనుటకు 
సామాన్య హృదయములు చాలవు.
-పుట్టపర్తి అనూరాధ

19 జులై, 2012

చిత్తరంజనమీ గానం




                                  కృష్ణ సాగరము దాటగోరి నే అష్టాక్షరి నామాశ్రితుడయ్యెద..

                                                     సహకారం రామావఝ్ఝుల శ్రీశైలం


చిత్తరంజన్  ..
నాలుగు దశాబ్దాలపాటు  
ఆకాశవాణిలో 
లలిత సంగీత కార్యక్రమాలు నిర్వహించి ..
సంగీత ప్రయోక్తగా 
పదవీ విరమణ చేసిన సంగీతతపస్వి..
వందలకొలది గీతాలను 
ఆకాశవాణికి అందించిన దేవులపల్లి 
తొలినాళ్ళలో ఆకాశవాణిలో పని చేశారని, 
అప్పుడు తాను ఆయన శిష్యునిగా 
లలిత గీతాలను స్వరపరిచిన 
అదృష్టవంతుడని తెలిపారు.
చిత్తరంజన్ గారు తొలినాళ్ళనుంచీ 
పుట్టపర్తి వారి ఎన్నో కీర్తనలను 
రాగరంజితం చేసారు.
ఆకాశవాణి 
కడప హైదరాబాదు విజయవాడ విశాఖ అన్ని కేంద్రాలలో అయ్యగారి భక్తి కీర్తనలు 
ఎన్నో సంవత్సరాలు జనాలను అలరించాయి
వానిని స్వరపరచింది దాదాపు చిత్తరంజన్ గారే..
ఇదిగో ..
ఇది చిత్తరంజన్ గారి హృదయ లయ ..