13 జులై, 2012

పుట్టపర్తి జీవితంలోని రసవద్ఘట్టాలు. వి.రమాపతిరాజు. కడప- పుట్టపర్తి అనూరాధ

 
 
 
           పుట్టపర్తి జీవితంలోని రసవద్ఘట్టాలు.
     వి.రమాపతిరాజు, కడప. ఆంధ్రజ్యోతి 1.9.92
          సహకారం రామావఝ్ఝుల శ్రీశైలం
సరస్వతీపుత్ర 
పుట్టపర్తి నారాయణాచార్యుల 
సాహిత్య జీవితంలోకి తొంగిచూచినప్పుడు. 
ఎంతో వైవిధ్యం కని పిస్తుంది. 
" మీరు ప్రధానంగా కవులా..? 
లేక పండితులా ..?"
అని ఆయన్నే అడిగినా ..
వెంటనే సమాధానం చెప్పలేనంత 
సాహిత్యానుభవం ఆయనది. 

ఆయన కవిత్వానికి 
ఆయన పాండిత్యానికి చోదకశక్తిగా పని చేసింది ఆయనకున్న అపారమైన జ్ఞానతృష్ణ 

కవిత్వం సరికొత్తగా చెప్పాలన్న 
తన అనుభవంలోకి రాని క్రొత్త భావాలకోసం 
ఇతర భాషల్లోని కవిత్వాలను చదివారు 
అందుకు 
అనేకభాషలు నేర్చుకున్నారు 
భాషల్ని ఆకళింపుచేసుకోవటానికి 
ఆ భాషలోని పదబంధాలను మధించారు 

కవిత్వంకోసం భాష..
భాష కోసం శాస్త్రం ..
శాస్త్రంకోసం పరిశోధన ..
అలా ..
ఆయన జ్ఞానతృష్ణ పరుగులు తీసింది 

దాని ఫలితమే 
కవిత్వం.. పాండిత్యం ..
సమపాళ్ళుగా రంగరించుకున్న 
ఆయన సాహిత్య జీవిత ఆవిష్కారం ..

మహాకవిగా..
 ఆయన్ని చూపెట్టే రచనలు 
శతాధికంగా వున్నాయి. 
కానీ ..
మహా పండితునిగా నిరూపించే 
సంఘటనలు 
మధుర స్మృతులు కూడా 
ఆయన జీవితంలో ఎన్నో నిలిచిపోయాయి. 

వాటికి ఒక అక్షరరూపం ఇస్తూ 
వారి ద్వితీయ వర్ధంతినాడు 
నివాళులర్పిస్తున్నాను. 

అప్పుడు పుట్టపర్తి వారికి పదహారేళ్ళు 
తిరుపతి సంస్కృత కళాశాలలో 
విద్యార్థిగా చేరటానికి ఇంటర్వ్యూ వచ్చింది. 

తిరుపతి వెళ్ళారు. 
అ ప్ప టి ప్రిన్సిపల్ 
కపిస్తలం కృష్ణమాచార్యులు..
సంస్కృతంలో..
 ప్రాచీన శాస్త్రాలలో..
మహా ఉద్దండులు.
 ప్రతిభ విషయంలో రాజీపడని వ్యక్తి. 

పుట్టపర్తి వంతు వచ్చింది. 
ఆయన చూపుకు ఈయన నిలువలేదు. 
సీటు సాధ్యం కాదు పొమ్మన్నారు. 
అభిమానం దెబ్బ తిన్న పుట్టపర్తి 
ఆవేశంలో నాలగైదు శ్లోకాలు 
సంస్కృతంలో ఆశువుగా చెప్పి 
బయటకు నడచి పోబోయారు. 
ఆ శ్లోకాలు విని 
ఆనంద భరితుడైన ప్రిన్స్ పల్ 
తిరిగి వెనక్కి పిలిపించి ..
ఏ శాస్త్ర విభాగంలోనైనా చేరవచ్చని చెప్పారట.
వ్యాకరణం ప్రధానంగా ఎన్నుకుని 
పుట్టపర్తి వారు విద్యా ర్థిగా ప్రవేశించారు. 

తిరుపతిలో 
వ్యాకరణ శాస్త్రం చదువుతున్నప్పుడే..
కంచి కామకోటి పీఠాధిపతి 
పెద్దస్వాములవారు తిరుపతిని సందర్శించారు 
వారి ఎదుట సంస్కృతంలో పుట్టపర్తిగారు 
అవధానం చేయవలసివచ్చింది 
పెద్దస్వామి 
ఎంతో ఆనందంతో ఆశీర్వదించి పంపారు. 

పుట్టపర్తి గారు  తన పందొమ్మిదవ ఏటనే 
భారతి పత్రికకు ఒక వ్యాసం పంపుతూ 
"విశ్వనాధవారు ..
సంస్కృత శబ్దాలు బాగా వాడగలరు గానీ ..
తెలుగులో అంత ఔచిత్యంగా వాడలేరు."
అని ప్రస్థావించారు.
 
ఆ తర్వాత కొన్ని నె లలకు 
ధర్మవరం (అనంతపురం జిల్లా) లో 
ఒక సాహితీ సంస్థ 
ఒక పెద్ద సాహితీ సదస్సు జరుపుతూ 
విశ్వనాధవారినీ ..పుట్టపర్తి గారినీ..
ఉపన్యాసకులుగా ఆహ్వానించింది 

పుట్టపర్తిగారు 
ఒక రోజు ముందుగా చేరుకున్నారు. 
విశ్వనాధవారు 
మరుసటి రోజున వస్తున్నారని 
ఆయనకు స్వాగతం పలుకడానికి 
నిర్వాహకులు రైల్వే స్టేషనుకు పోతూ 
పుట్టపర్తి వారిని కూడా రమ్మన్నారు. 

విశ్వనాధను అంతకు ముందు 
పుట్టపర్తి ఎప్పుడూ చూచివుండలేదు. 
అందువల్ల ..
వారి మీది గౌరవంతో ..
వారితో పాటు స్టేషనుకు వెళ్ళారు. 

విశ్వనాధవారు రైలు దిగారు. 
నిర్వాహకులు పుట్టపర్తిని పరిచయం చేసారు. విశ్వనాధ వారు పుట్టపర్తిని చూస్తూ..
 "నీ చేత ..
నాకు తెలుగు పదాల ప్రయోగం బాగా వచ్చు"
అని అనిపించటానికి వచ్చాను 
అని అన్నారు 
"సరే మంచిదే.."
అని అన్నారు పుట్టపర్తి వారు

ధర్మవరంలో 
నాలుగు రోజుల పాటు బహిరంగ 
వాద సంవాదాలు ఏర్పాటు చేసారు. 
ఉదయం పుట్టపర్తి వాదాన్ని ఖండిస్తూ 
విశ్వనాధ మాట్లాడితే ..
సాయంత్రం విశ్వనాధ ని పూర్వపక్షం చేస్తూ 
పుట్టపర్తి వారు మాట్లాడుతూ పోయారు. 

వారి వాదనను సమర్థించుకుంటు 
కొన్ని ప్రాకృత భాషలనుండి 
ఉదహరిస్తూ మాట్లాడారు 
అవి తనకు తెలియవని 
విశ్వనాధవారు అన్నారట. 
పరిష్కారం కనిపించలేదు. 

చివరకు ..
పుట్టపర్తి వారి సతీమణి కనకమ్మ గారు 
ఇద్దరినీ సమావేశపరిచి 
వారిద్దరూ సమానులే 
అని తీర్పు చెప్పి 
వివాదానికి తెరపడేట్టు చేసారు.
 
ఈ రీతిగనే కడపలో 
ఆలిండియా ఓరియంటల్ కాంఫరెన్స్
 కొద్ది రోజులపాటు జరిగింది. 
పుట్టపర్తి అభిమానులూ 
విశ్వనాధ అభిమానులుగా 
ప్రేక్షకులు సాహిత్యకారులూ చీలిపోయారు. 

మొదట రెండు రోజుల సభలకు 
ఊళ్ళో లేనందున ..
పుట్టపర్తి వారు హాజరు కాలేదు. 
ఇది చూసుకుని..
వీరికి సంస్కృతం రాదనీ ..
కన్నడం రాదనీ ..  ఆంగ్లం  రాదనీ ..
ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేసారు. 
కదిరి హైస్కూలులో ..
తన ప్రసంగ కార్యక్రమం ముగించుకుని 
రెండో రోజు రాత్రి కడప చేరుకొని 
నేరుగా ఇల్లుచేరుకున్నారు. 

అప్పటికే ..
ఆయన అభిమానులంతా 
ఇంట్లో గుమికూడి వున్నారు. 
రేపు ఎట్లైనా వ్యతిరేక ప్రచారకుల 
నోళ్ళు మూయించాలని అన్నారు. 

రాత్రికి రాత్రే శ్రీ పుట్టపర్తి 
"సాహిత్యంలో అహంకారం"
  అనే అంశంపై  ప్రసంగ పత్రాన్ని 
మరుసటి రోజు సభలో 
చదవడనికి సిధ్ధం చేసుకున్నారు. 

మరుసటిరోజు సభలో 
ఏయే భాషా సాహిత్యంలో 
అహంకారం యొక్క పాత్ర ఎలా వుండిందో 
సోదాహరణంగా వివరిస్తూ..
చివర్లో 
"తనకు పధ్నాలుగు భాషలు వచ్చుననీ..
ఎవ్వరైనా వేదికమీదికి వచ్చి 
పరీక్షించుకోవచ్చుననీ "
సవాల్ విసిరారు. 
ఎవ్వరూ వేదిక మీదికి రాలేదు. 

ఆయన వేదిక దిగి రాగానే 
అంతవరకూ విమర్శించిన వారే చుట్టూ చేరి
 "యేదో మీ అభిమానుల్ని ఉడికించడానికి 
తమాషాగా అన్నాం కానీ 
మీకు రావని మేము అనగలమా..?"
 అని అన్నారు 

లోకం తీరు అలా వుంటుందని 
పుట్టపర్తి గారుచెప్పారు  తన అభిమానుల్తో

కడప రామకృష్ణ జూనియర్ కాలేజీలో 
పుట్టపర్తి గారు తెలుగు పండితులుగా 
పనిచేస్తున్న రోజులలో ..
ఒకసారి ..
శృంగేరి పీఠాధిపతులు వచ్చారు 
ఈయన స్వామివారి దగ్గరకు వెళ్ళీనా 
తన తోటి బ్రాహ్మణులు 
పుట్టపర్తి గారికి జుట్టులేదనీ ..
బొట్టు లేదనీ ..
సాంప్రదాయక వేషం లేదనీ ..
పీఠాధిపతులకు పరిచయం చేయలేదట 

స్కూల్ కరస్పాండెంట్ అయిన రంగనాధం 
పుట్టపర్తి వారిని పరిచయం చేసారు. 
అప్పుడు వెంటనే పుట్టపర్తి వారు 
15 శ్లోకాలు సంస్కృతంలో 
పీఠాధిపతుల నుద్దేసించి చెప్పారట. 
ఆ తర్వాత స్వామి 
పుట్టపర్తి గారిని తన రూముకు పిలిపించుకుని "అధాతో బ్రహ్మ జిజ్ఞాస" 
అన్న మొదటి బ్రహ్మ సూత్రంపై చర్చకు దిగారు. 

గంటన్నర సేపు పుట్టపర్తి వారు వాదించారు. 
స్వాముల వారు వీరిని
పెద్ద జరీ అంచు శాలువా కప్పి 
ఆశీర్వదించారు. 
ఆ తర్వాత మాట్లాడుతూ 
పుట్టపర్తి వారిని 
క్రాపు తీసేసి ,,పిలక పెట్టుకోమని  సూచించారట స్వాములవారు. 
పుట్టపర్తి గారికి కోపం వచ్చి 
తాను 24 లక్షల సార్లు గాయత్రిని 
25 కోట్లు నారాయణ మంత్రాన్నీ జపించాననీ 
కానీ  తన కే దివ్యానుభూతీ కల్గలేదనీ 
వారికేమైనా కలిగివుంటే చెప్పమనీ .. 
అలా కోరుతూ ..
తులసీదాసును ఉదహరిస్తూ 
ఒక చరణం చెప్పినారు 
అందుకు అగ్రహోదగ్రుడైన పీఠాధిపతులు "తులసీదాసుకేమి తెలుసు..?
అతడు ముస్లిం కాదా ..?"
అని అన్నాడు
"తులసీదాసుకు తెలియనిది నీకేమి తెలుసు .."?
అని కోపంగా ప్రశ్నించి 
పుట్టపర్తి బయటికి వచ్చేసారు.
ఆ తర్వాత స్వాములవారు 
పుట్టపర్తి అసాధ్యుడనీ 
అతన్ని వప్పించలేక పోయాననీ అన్నారట.