ఆపాత మధురం ఆలోచనామృతం
                    డాక్టర్ చక్రవర్తుల రామానుజాచార్యులు

పుట్టపర్తి వారు
చనిపోయే కొద్ది నెలల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ

ప్ర. అవధానం చేస్తున్నంత జీవిత బిజీగా వున్నారనిపిస్తోంది మరి..

లేదు..
 అట్లా అనుకోవద్దు
ఎవరికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదు
అని అంటూ దిండు కిందనుంచీ ఒక లెటరు తీసారు
ఒక అవధాని ఆశీస్సులకోసం మాచర్ల నుంచి రాసారు.
చూడండి..
 అంటూ ఉత్తరం చేతికి ఇచ్చారు

మీ లేఖ కోసం ఎదురుచూస్తున్నాను.. అని రాశాడు పైగా
నన్ను ధీషణా అని సంబోధించాడు.
ఇతని శాబ్దిక జ్ఞానం ఏపాటిది..?
ఇతడు అష్టావధానం చేస్తున్నాడట..!

ఇపుడు మా ఊళ్ళో కడపలో
ఒక పాతిక మంది అష్టావధానులున్నారు.
ఈ వీధిలో ఇద్దరు పక్క వీధిలో ఇద్దరు ఉన్నారు
తాలూకాఫీసులోని గుమాస్తాలను
పృచ్ఛకులుగా  ఏర్పాటు చేసుకొని
అవధానం ముగిస్తున్నారు.

ఇక అవధానం విషయానికి వస్తే
Avadhaanam is not at all a proper held
to exhibit the talents of a poet

ప్ర. మీరూ అవధానాలు చేసినట్లు గా కొందరు చెబుతున్నారు నిజమేనా..

అవును నేనూ
నా చిన్నతనంలో అవధానాలు చేశాను
ఒకసారి
మున్నూరున్ ముప్పదియారు దేవతలు..
అంటూ ఒక సమస్యను
నాగపూడి కుప్పుసామి గారు ఇచ్చారు.
నేనెక్కడ చచ్చేది
ప్రాసస్థానంలో శకట రేఫను నిలపాలి.

దీనికి సాధురేఫంతో ప్రాస కూర్చి సమస్యను పూరించాను.
తిక్కన మౌసల పర్వంలో
ఈ విధమైన ప్రాసవుంది చూసుకోమని
సభలో అందరినీ ఒప్పించాను.

మరునాడు నాగపూడి కుప్పుసామిగారి వద్దకు వెళ్ళి
సాష్టాంగ పడి
సామీ
ఇలాంటి ప్రాసలు కూర్చమంటే
అప్పటికప్పుడు నేనేమి చేసేది
అని ఒక్క నమస్కారం చేసాను.
వారు నవ్వి ఊరుకున్నారు.

నేటి పండితులపై పాండిత్యంపై మీ అభిప్రాయం

వెనకటి రోజులలో
పాండిత్యం కవిత్వానికి బలం ఇచ్చేది.
తర్క వ్యాకరణాలు క్షుణ్ణంగా చదివిన వారు ఆశుకవిత్వం అవధానం అనే ప్రక్రియల్లో రాటుదేలారు.
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రులు గారి
తార్కిక బుధ్ధి అనూహ్యం.
తిరుపతి శాస్త్రి గారి వ్యాకరణ జ్ఞానం అపారం

ఆనాడు ఒక సభలో పొందిన పేరు
వేరొక సభలో సన్మానం పొందడానికి యోగ్యత కాదు
మళ్ళీ కథ మొదలయ్యేది.

అందువల్ల ఆనాడు పండితులు
తాము చదివింది చివరివరకూ గుర్తుంచుకోవలసి వచ్చేది.
ఇలాంటి అస్త్రాలను తమ దగ్గర పెట్టుకుని
రాజసభల్లో ప్రవేశించేవారు.

ఈనాడు అలాంటి అవసరం లేదు.
ఎప్పుడో పరీక్షకు చదివి కాగితం (సర్టిఫికేట్) సంపాదిస్తే
అది ఉద్యోగాన్నిచ్చి కల్పతరువులా ప్రతినెలా వేలల్లో డబ్బు ఇస్తుంది.

రాళ్ళ పల్లి వారికీ మీకూ గాఢానుబంధం ఉండేదంటారు అది ఎలాంటిదంటారు.

రాళ్ళపల్లి వారు నాకు గురువు వంటి వారు
వారివద్ద నేను ప్రాకృత భాషను అభ్యసించాను వారు చాలా సౌమ్యులు He is a cool thinker వారు సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ కనబరచేవారు.
ఆయన ఒక పాఠాన్ని ఏర్పరిస్తే
దానిని కాదనే దమ్ములు ఎవరికీ వుండేవికావు.

ఆనాడు ఎంత పండితుడైనా
ఎంత ప్రావీణ్యం పొందినా
నిరంతర సాధనను వదలి పెట్టే వారు కారు.
రాళ్ళపల్లి వారూ నేనూ
మైసూరు వాసుదేవాచార్య గారి వద్దకు వెళ్ళాం
అపుడు వారు తంబూరా మీటుతూ
ఒక వర్ణాన్ని సాధన చేస్తున్నారు.

ఏమిటి మీరు గొప్ప విద్వాంసులు కదా
ఇప్పుడీ సాధన యేమిటి
అని అడిగాను.

వాసుదేవాచార్యగారు
ఈ సాధన ఎంతవరకు చేస్తుంటానో
అంతవరకే నేను విద్వాంసుణ్ణి అని అన్నారు.

మీరు పదునాలుగు భాషలలో పండితులని పేరు పొందరు కదా

అని అందరూ అంటుంటారు
నేను మాత్రం అలా అనుకోను
ఎందుకంటే ఒక్క విషయం చెబుతాను
ఒక్క భాషలో పండితుడు కావటానికే
ఒక్క జీవితకాలం సరిపోదు
మరి అలాంటప్పుడు
పధ్నాలుగు భాషలలో ఎలాపండితుణ్ణవుతాను
కాకుంటే
నాకు ఆ పధ్నాలుగు భాషలకూ సంబంధించిన జ్ఞానం ఉంది.

మీరు ఆంధ్రేతర భాషలలో ఏమైనా రచించారా

నేను విశ్వనాధవారి ఏకవీరను మళయాళంలోకి అనువదించాను అలాగే కన్నడంలోకి మరాఠీలోకి కొన్ని కవితలు అనువదించాను.

పద్య సాహిత్యం గురించి మీ అభిప్రాయం

ఏముంది
సదభిప్రాయమే
అయితే ఈనాడు చిన్నచూపుకు గురి అయింది
నాకు తెలిసిన ఒకడు
కవితా గోష్టిలో పాల్గొన్నట్లుగా నాతో చెప్పాడు
అక్కడ ఏం చదివావు
అని అడిగితే
ఒక కవిత చదివానని చెప్పాడు
ఇతరులేమి చవివారని అడిగితే
ఒకరిని గూర్చి
అతడేవో పద్యాలు చదివాడు లెండి అని అన్నాడు

అంటే అతని ఉద్దేశం లో పద్యాలు కవిత కాదనా
ఇలాంటి అభిప్రాయం నేడు ప్రాచుర్యం పొందింది.
నా దృష్టిలో పద్య కవిత్వం ఏ భాషా సాహిత్యానికైనా ప్రధానమైంది.

మీ సమకాలిక తెలుగు కవులతో అనుభవాలు

మీ సమకాలిక తెలుగు కవులతో అనుభవాలు

సమకాలికుల్లో విశ్వనాధవరితో నాకు గాఢానుబంధం ఉంది.
ఏ వేదిక మీద మేమిద్దరం కలుసుకున్నా రగడ అయ్యేది మేము మొదట ధర్మవరంలో కలిసాము.
ఆయన రైలు దిగి వస్తున్నారు
ఆయనకు నన్నయ అంటే అపారమైన భక్తి
నేను కన్నడంలో పంప భారతం చదివాను
నన్నయ మీద పంపని ప్రభావం వుందని గ్రహించాను
ఆ విషయమే ఇప్పుడు
ఆంధ్ర సాహిత్య చరిత్ర గ్రంధాలలో చోటుచేసుకుంది.

అప్పటికీ నన్నయ మీద పంపని ప్రభావం అనే వ్యాసం
భరతి సాహిత్య పత్రికలో ప్రచురింపబడింది
దానిని ఆయన చదివి వున్నాడు
 ఏమయ్యా
 నీ ఉపన్యాసంలో పొరబాట్లు రాశావే
నన్నయ మీద పంపడి ప్రభావం ఉందన్నావు
నీ వాదనను ఖండించడం కోసమైనా
నేను కన్నడం నేర్చుకొని పంప భారతాన్ని పరిశీలిస్తాను.
అని విశ్వనాధ నాతో అన్నాడు.
నాకు స్పర్థ ఒక్క విశ్వనాధతో మాత్రమే
నేనొకసారి సాహిత్య అకాడమీలో విశ్వనాధతో
సత్యనారాయణా నీకు ఏపాటి సంస్కృతం వచ్చు
అని ప్రశ్నించాను

తిట్టించుకొని కూడా మళ్ళీ అదే ఇంటికి వచ్చే సౌజన్యం
ఆయనలో వుంది
నా భార్య 387 సారులు రామాయణాన్ని పారాయణం చేసింది విశ్వనాధ మా ఇంటికి వస్తే
వంట ఇంట్లో నా భార్యకు
తన కల్ప వృక్ష పద్యాలను వినిపించేవాడు
 ఆమె ఆ పద్యాలకు
corresponding verses మూలమ్నుంచీ చెబుతుండేది
ఆయమ్మ కాలం చేసి మూడు సంవత్సరాలయింది
విశ్వనాధ విషయంలో
ఆయనను మొడటి రోజుల్లో అందరూ ఎత్తి పొడిచారు
అయినా చెక్కు చెదరని ఆయన గుండెనిబ్బరం
తరువాతి రోజులలో ఆయనను మహాకవిని చేసింది

విశ్వనాధకు ఉన్న depth of learning
ఏ ఇతర కవిలోనూ లేదు
తాను తొలిరోజులలో అనుభవించిన హింసకు ప్రతిగా
ఆయన తరువాత కాలంలో
అందరిమీదా రెచ్చిపోయే
attacking nature అలవరచుకున్నాడని
నేను అనుకుంటాను.


విశ్వనాధవారిని గురించి చెప్పారు కదా శ్రీ శ్రీ గారిని గూర్చి మీ అనుభవం ఏమిటి

శ్రీ శ్రీతో కూడా నాకు అనుబంధం ఉంది.
అతను ఒక వ్యాసంలో
రాయలసీమ కవులలో నన్ను గొప్పవాణ్ణిగా పేర్కొన్నారు.
అతను గుమ్మడి వేంకటేశ్వరరావు కలిసి
మదరాసు లా కాలేజీలో నాకు సన్మానం చేసారు.
శ్రీ శ్రీకి తెలుగులో వసుచరిత్ర అంటే చాలా యిష్టం.

వర్ధమాన రచయితల గురించి చెప్పండి

నన్ను కలిసికొన్న కొందరు
వర్థమాన రచయితల గురించి మాత్రం చెబుతాను
ఒక రచయిత ఇటీవల నా వద్దకు వచ్చి
నన్ను ఒక గ్రూప్ కట్టమన్నాడు
అపుడు నా బలం పెరుగుతుందని చెప్పాడు
ఎంత పిచ్చి ఊహ ఇది
నా పుస్తకం ఇష్టమైతే చదువుకుంటారు.
లేకపోతే అవతల పారేస్తారు.
ఏమయితే నాకేం అని చెప్పి పంపాను.
ఇంకొక రచయిత శతకం రాసి
దానికి నన్ను అభిప్రాయం రాయమని
నా వెంట పడ్డాడు
తీరా పుస్తకం తీసి చూస్తే
శివుణ్ణి శ్రీ భ్రమరహృదయేశ్వరా అన్నాడు
భ్రమర హృదయేశ్వరా అంటే
భ్రమరాంబికా హృదయేశ్వరా అని నేను అర్థం చేసుకోవాలా
ఎలా అయితేనేం
దానిమీద నాలుగు మాటలు రాసి చివరలో
ఈ రచయిత జాగ్రత్తగా
ఇంకా జాగ్రత్తగా
రచన సాగించి వుంటే బావుండేదని ముగించాను.

మరొక రచయిత వచ్చాడు
అతను ఏదో అవార్డు కోసం దరఖాస్తు పెడుతున్నాడు
దానితో పాటు తెలుగులో ఒక well known poet చేత
దరఖాస్తు దారుడు తెలుగు కవిత్వంలో దిట్ట
అని ఒక సర్టిఫికెట్ తీసి జత చేసి పంపాలట
ఆ సర్టిఫికేట్ నన్ను ఇవ్వమని కోరాడు
నేను అంత ప్రతిభ కల వాణ్ణి కాను అని అన్నాను
అతను ఒప్పుకోలేదు
చివరకు నన్ను ప్రలోభపెట్టాలని చూసాడు
అవార్డుకు వచ్చే మొత్తాన్ని
చెరి సగం తీసుకుందామని ఆశచూపాడు
భ్రష్టుడా
ఇక్కణ్ణుంచీ లేచి వెళ్ళమని తరిమివేసాను
ఇలాగ వుంది వర్థమాన రచయితల పరిస్తితి.

మీకు కలిగిన ప్రశంసలను గూర్చి చెప్పండి

ఎన్ని ప్రశంసలు కలిగినా ఒక్క ప్రశంస మాత్రం
నన్ను ఇప్పటికీ సంతోషపరుస్తుంది నా పండరీ భాగవతం చదివిన విశ్వనాధ నా కన్నా నీవు ఎన్నో రంగాలలో అధికుడవు అని ఉత్తరం వ్రాసాడు అవి విశ్వనాధ చాలా ఎత్తుకు ఎదిగిన రోజులు ఆ రోజుల్లో ఆ వుత్తరాన్ని ప్రచురించి అతనిపైన నా అధికారాన్ని చాటుకోవటం ఇష్టం లేక ఆ వుత్తరాన్ని ఎప్పటికైనా వైశ్వనాధులు తమ తండ్రి ఘనతను ఆకాశానికెత్తితే చూపెడదామని అలాగే వుంచాను
తర్వాత ఆ వుత్తరం కనిపించలేదు
ఇంట్లో అందరినీ అడిగాను
అపుడు మా అమ్మాయి నాగపద్మిని
ప్రస్తుతం హైదరాబాదు AIR లో పని చేస్తూ వుంది
ఆ వుత్తరం తన వద్ద వున్నదంటూ తెలిపింది
ఒకసారి విజయవాడలో శివతాండవం చదివాను
అదివిన్న విశ్వనాధ
నన్ను తన భుజాలపై ఎక్కించుకున్నాడు
ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే
విశ్వనాధకు తన ప్రతిభ పట్ల ఎంత గర్వం వుందో
ఎదుటి వాడి పట్ల కూడా
తానూ అంత గర్వాన్ని పొందుతాడు
ఆయన గుణ పక్షపాతి అని నిస్సందేహంగా చెప్పగలను

మీ స్వ స్థలం

మా వూరు అనంతపురం జిల్లాలో
పెనుగొండ దుర్గం మాది
కృష్ణ దేవరాయల గురువులైన తాతా చార్యుల వారి వంశం
మొదట్లో కావలి కాలేజీలో పనిచెయ్యమని అడిగారు
కానీ నేను ఈ వూరు వదలడం ఇష్టం లేక
దానికి సమ్మతించలేదు.

మీరు ఆంధ్రేతర ప్రాంతంలో కూడా చాలా కాలం వున్నారు కదా ఎలా గడిచింది

నేను ఢిల్లీ లో కొంతకాలం నివసించాను
అక్కడ ఉన్నకాలంలో
బౌధ్ధ వాఙ్మయంతో పరిచయం కలిగింది
దాంతో బౌధ్ధమతం పట్ల ఆసక్తి కలిగింది
కానీ ఆ తర్వాత
ఒకసారి అరవిందుల్ని కలవడం జరిగింది
దానితో అరవిందుని ఫిలాసఫీ పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను
నేను తరచుగా పాండిచ్చేరి లో వున్న
అరవిందాశ్రమానికి వెళుతుంటాను
నాలో ఇప్పటికీ ఒక తపన మిగిలి వుంది
అదేమంటే
అరవింద ఫిలాసఫీ ని
కార్ల్ మార్క్స్ సిధ్ధాంతాలను
బ్లెండ్ చేస్తే తయారయ్యే ఫిలాసఫీ
ప్రతి భారతీయుడూ అనుస్రించదగిన తత్వంగా నిలుస్తుందని
నా ప్రగాఢ విశ్వాసం
నా నీవితంలో ఆ పని చెయ్యాలనే తపన
విపరీతంగా వుంది
దీనిని సాధించగలనో లేదో

మీ ప్రస్తుత వ్యాసంగం ఏమిటి

నేను ప్రస్తుతం
వంద సంవత్సరాల రాయలసీమ చరిత్రను రాస్తున్నాను
దీనిలో నేను పూర్తిగా నేపధ్యంలో వుంటు
రాయలసీమ నాగరకతను
సంప్రదాయాలను స్థితిగతులనూ చిత్రిస్తున్నాను
దీనిద్వారా
ఒక విధంగా నా స్వీయ చరిత్రను కూడా చెప్పినట్లవుతుంది.
 ప్రతుతం ఆ పనిలో వున్నాను.

మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా వుందా

నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో
విద్వాన్ పరీక్ష యిచ్చాను
అప్పటికే నా రచన పెనుగొండ లక్ష్మి
ఆ పరీక్ష కు సిలబసులో చేర్చబడింది
నేను అదే పరీక్షలో తప్పాను
ఇంతకంటే ఏం చెప్పమంటారు.

ఒక సందేహం ఈనాడు త్యాగయ్య కృతులను ఆలాపిస్తున్న గాయకులు త్యాగయ్య ఫక్కీలోనే గానం చేస్తున్నారని భావించడమెలా త్యాగయ్య ఇలానే గానం చేసాడని ఎలా నమ్మగలం

నిజమే
నాడు ధ్వని గ్రహణం sound recording  లేకున్నా
త్యాగయ్య కీర్తనలను పరంపరగా
మౌళిక ప్రచారాన్ని పొందాయి
తర తరాలుగా అవ్యవహితంగా సాగిన గానమది
ఇప్పటికీ తిరువాయూరులో
వేదపాఠం లాగా కొనసాగుతూ వుంది
ఇప్పటి గాయకులలో ఎవరైనా
తమ గాత్రానికి తగిన సంగతులను ఏర్పరచుకోవచ్చునేమో గాని frame work మాత్రం
అక్షరాలా త్యాగయ్య ఆలపించిన తీరుగానే వుంటుంది

అందువల్ల ఆనాడు త్యాగయ్య
ఏ స్తితిలో ఒక కీర్తనను ఆలపించాడో
ఈనాడు మనం ఆ కీర్తనను
త్యాగయ్య పంధాలోనే వినగలుగు తున్నాం.

సరస్వతీపుత్రుని తృతీయ వర్ధంతి సందర్భంగా రచన
ఉదయం పత్రిక