10 డిసెం, 2013

'భారతదేశం పట్టనంతటి కవి '

ప్రదేశం ఆలంపూర్..
జరుగుతున్నది మహామహులు పాల్గొనే సభ..
అధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణన్..
 

ఆ సభలో పుట్టపర్తి ఒక వాణి వినిపించారు
విషయం తెలుగు కన్నడముల చుట్టరికము
పంపని భారతన్నీ నన్నయ భారతాన్నీ పోల్చే ప్రయత్నం
 

చాళుక్యులు పంపనిచే భారతము ననువదింపజేసి 
తమ కీర్తికాయమున కాయువు పోసుకొన్నారు
మరి రాజనరేంద్రుని ప్రోద్బలంతో నన్నయ 

యీ కార్యానికుపక్రమించాడు
 

చాళుక్య వంశాన్ని గొప్పగా వర్ణించే పంపడు
భారతం లో తనకాశ్రయమిచ్చిన అరికేసరినే 

అర్జునునిగా ధ్వనింపజేస్తూ రచన సాగించాడు
మొన్నటికి మొన్న 

మన యన్ టీ ఆర్ 
ట్యాంక్ బండ్ పై పలు విగ్రహాలు ప్రతిష్టింపజేస్తే 
అందులో ప్రతి ముఖములోనూ 
ఆ యన్ టీ ఆర్ కవళికలే పలికినట్లు

పంప భారతాన్ని పలుమార్లు 
తన కార్యనిర్వహణలో భాగంగా చదివిన నన్నయ్య
తానూ అతనికన్న మెరుగుగా ధ్వని మార్గమున 

యీ పని చేయాలనుకున్నాడు
ధర్మరాజుతో రాజరాజును పోల్చే ప్రయత్నం చేశాడు
 

పంపని భారతాన్ని 
అతడేవిధంగా చేసాడనే పరిశీలనలో 
కొన్ని చోట్ల అనుసరించి 
మరికొన్ని చోట్ల తన పంధాననుసరించి 
నన్నయ్య పనిచేసాడు
 

ఇలా నన్నయపై పంపభారతం ప్రభావముందన్నది నిరూపించే ప్రయత్నం
యీ వాదం తెలుగు వారైన కవులకు నచ్చలేదు
వారు మారువేషం వేసుకున్న కన్నడిగుడని 

పుట్టపర్తిని నిందించారు
విశ్వనాధ కన్నడం నేర్చుకొని పరిశీలించి 
సమాధానం చెబుతానన్నారు
 

కానీ సాహిత్యానికి భాషాభేదం లేదు
తెలుగు సరస్వతి ..కన్నడ సరస్వతి ..వుంటుందా..
కేవలం తెలుగులోనే కూపస్తమండూకాలవడం సబబా..
ఇంతకూ అందరిలో తనదే పైచేయిగా మెలగడం 

పుట్టపర్తి లక్షణం..
 

దానికి ఎంతమంది ఉడుక్కున్నా.. అసూయ పడినా.. సరే
కాదంటే చర్చకు రావలసివుంటుంది

కేవలం తెలుగులో తేలడానికే 
ముష్టియుధ్ధాలూ 
దిక్కుమాలిన రాజకీయాలనాశ్రయించే సాహిత్యకారులు ఇతరభాషలవేపు తొంగిచూచే ప్రయత్నమైనా చేస్తారా.. ?
దానికి తగ్గ సత్తా యెవ్వరిదగ్గరా లేకపోవటం 

పుట్టపర్తి తప్పుకాదు కదా ..!

మన పక్కనున్న కన్నడానికే అదిరి పడితే
మళమాళమేమిటి
తమిళమేమిటి
అసలు మరాఠీ వ్యాకరణమే క్లిష్టం లిపి మరింత క్లిష్టం
ఇక మాగధి అర్ధ మాగధి పైశాచీ
అందుకే పుట్టపర్తిని 'భారతదేశం పట్టనంతటి కవి 'అన్నారు


మరాఠీ  ప్రసిధ్ధ నాటకాలను పుట్టపర్తితో అనువదింపజేసారు అక్కడివారు
 

నిన్ను తెలుగు ప్రజలు గుర్తించకపోతే పోనీ 
మా కేరళ ప్రభుత్వం తరఫున నిన్ను మా ప్రతినిధిగా పంపిస్తాం అంటూ
కేంద్ర సాహిత్య అకాడమీకి తమ ప్రభుత్వం తరఫున పుట్టపర్తిని పంపారు మళయాళీలు
అంతెందుకు..
 వారి మళయాళ నిఘంటు నిర్మాణంలో..

 పుట్టపర్తి కీలక పాత్ర వహించారు వారి అభ్యర్థనపై

 

 

















కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి