16 ఏప్రి, 2014

పాత్రలేమంటాయి ..?

భాగవతంలో స్త్రీ పాత్రలెన్ని వున్నాయి
ఆ .. దేవకి..యశోద..గోపవనితలు..

కుబ్జ..సత్యభామ..
రుక్మిణి .. ప్రహ్లాదుని తల్లి లీలావతి..
 అబ్బో .. 

చాలా..  చాలా .. ఉన్నాయి.. 

దేవకి 'అన్నా..  అన్నా..  '
అని  పిలుస్తూ తిరిగే పిల్ల. 
ఆకాశవాణి 
 'నీ చెల్లెలి ఎనిమిదవ గర్భంలో జన్మించేవాడు 
నిన్ను చంపుతాడు '
అని చెప్తే చెల్లెలని కూడా చూడకుండా
 తీసుకెళ్ళి జైల్లో వేశాడు కంసుడు
 

అక్కడే ఎనిమిది మందినీ కని 
వారిని అన్న వధిస్తూ వుంటే కన్నీరు కార్చింది
కనీసం నిందించనైనా లేదు అన్నను
 

ఆఖరికి ఎనిమిదవ బిడ్డను చంపబోగా
'అన్నా..  ఇది ఆడపిల నీ మేన గోడలు.. వదులన్నా..'

అని ప్రాధేయపడింది
ఆ ఎనిమిదవ బిడ్డనా కాశానికి ఎగురవేయగానే 

'ఒరే..  నిన్ను చంపేవాడు ..
ఇంకో చోట పెరుగుతున్నాడ్రా..'
  అని మాయమైతే
 

కంసుడు
'అయ్యయ్యో చెల్లీ ..తప్పయిపోయింది..

 నిన్ను ఇన్ని రోజులూ ఇబ్బంది పెట్టాను..
 యేం చేయను ..?
నా ప్రాణమూ విలువైనదే కదా..
నన్ను క్షమించండి ..

మీరు మీ రాజ్జానికి పోయి హాయిగా వుండండి
 అని అంటే
 

'సరే'.. నంటూ 
భర్తతో కలిసి వెళ్ళిపోయింది
ఎంత సౌజన్య మూర్తి ..

ఇంక కృష్ణుని పెంచిన యశోద  

నందుని భార్య
తన ముద్దుల తనయుని పై వల్లమాలిన ప్రేమ
అబ్బ ..

కృష్ణుని ఎన్ని తిప్పలు పెట్టిందనుకున్నారు
రోలుకు వేసి కట్టింది, 

చెవి మెలి పెట్టింది,
మన్ను తిన్నావా ? ఏదీ నోరు చూపించమంది
 

పాలు వెన్న పెరుగూ దొంగతనం చేస్తున్నాడని 
అందరు ఆడవారు పిర్యాదు చేస్తే
'మా ఇంట్లో పాలు పెరుగూ లేవా?

 మీ ఇంట్లో దొంగతనం చేయలా..?
పొండమ్మా ..మా చెప్పొచ్చారు ..''
అని వాళ్ళని దబాయించింది.
 

కాళీయమర్దనం చేసినా .. 
బకాసుర సం హారం చేసినా..  
శకటాసుర భంజనం చేసినా.
నా బిడ్డకేమైతుందో .. 

అని గాభరా పడి దిష్టి తీసిందే కానీ..
ఇంతటి అతిలోకుడు తన బిడ్డడన్న 

స్పృహ ఆమెకు కలగలేదు
 


చుశారా..  యెన్ని వైవిధ్యాలో..
 

పుట్టపర్తి అంటారూ ..
పోతనామాత్యులకు వివిధ చిత్తవృత్తులు గల నాయకులను సృష్టించటం కంటే
నాయికలను సృష్టించమే ఇష్టమట..
 

అంగవర్ణనలు కాక ..
వారి చేష్టలు.. విలాసములు.. వర్ణించటం 
పోతన్న గారికి ప్రియమైనదట..
మరి మనమేం చేద్దాం..
చక్కగా విందాం..
సరేనా.. 








పోతనామాత్యులకు 
వివిధ చిత్తవృత్తులుగల నాయకులను సృష్టించుటకంటెను 
నాయికలను సృష్టించుట లో 
నెక్కువ యపేక్ష యున్నట్లున్నది

ఆతడు వర్ణించిన 
శకుంతల శర్మిష్ట దేవకి దేవయాని రోహిణి యశోద వీరందరు చిత్తవృత్తులలో 
కేవలము విభిన్నలైన వ్యక్తులు.

త మ కొక రెండుదాహరణములు 
మాత్రమే మనవి చేసు కొందును

ఊర్వశికి మిత్రావరుణుని శాపము గలిగెను. 
అందుచే నావిడకు మానవజన్మ మేర్పడినది

కాని యంతకు ముందే 
యూర్వశికి పురూరవునిపై నొక ప్రెమ కద్దు
కారణమేమనగా.. 
ఆతని శౌర్య సౌందర్య గంభీర్యాది  గుణములను 
నామె యింద్రుని సభలో నారదునిచే విన్నదట

ఊర్వశి భూలోకమునకు వచ్చి 
పురూరవుని ముందట నిలువబడినది
వాడిట్లున్నాడు.. 

''సరసిజాక్షు మృగేంద్ర మధ్యు విశాలవక్షు మహాభుజున్
సురుచిరానన చంద్రమండల శోభితున్, సుకుమారు నా
పురుష వర్యు పురూరవుం గని పూవుటం పరజోదుచే
దొరగు క్రొవ్విరి సూపులం మది దూల పోవగ భ్రాంతయై''

ఊర్వశి భ్రాంతయైనను 
ఆమె తన హృదయము నెరి గింపలేదు 
ఊరక నిలచియున్నదట.. 
ఇది స్త్రీ ధర్మమే.. 

పురూరవుడును ఊర్వశిని జూచెను.. 
వాడు 'దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటికంచు.. ? మరు ని ముసముననే నిర్ణయించుకున్నాడట

ఎట్టకేలకు వాడే ప్రేమోదంతము నారంభించెను
పురూరవుడన్న మాటలివి.. 

'ఎక్కడ నుండి రాక మనకిద్దరకుం దగు నీకు దక్కితిన్
మ్రుక్కడి వచ్చెనే యలరు ముల్కులవాడ డిదంబు ద్రిప్పుచే
దిక్కు నెౠంగనీడు నను దేహము దేహము గేలు గేల నీ
చెక్కున చెక్కు మోపి తగు చెవ్యుల నన్ను విపన్ను గావవే''

ఊర్వశి మహా ప్రౌఢ.. 
వాడీ మాటలన్నంతనే 
'వీడు లఘు హృదయుడని..  
యర్థము సేసికొన్నది

ఈ భావము నామె బైట బెట్టినది గాదు
ఇంతలో గంధర్వులు వచ్చి 
పురూరవుని ప్రేమ విఘాతమును జేసినారు
ఆమె వాని కన్ను మర గి పోయినది

నాటనుండి పురూరవుడు వెర్రి వాడై 
ఊర్వశిని వెదుకుచున్నాడు 
ఒకసారి సరస్వతీ నదీ తీరమున నామె 
వాని కంట బడెను

వీనిని వదలి పోయినది మొదలు.. 
 ఊర్వశికి వీని గాలియే లేదు
'యోగ వియోగములకు మనసివ్వరాద'నునది 
యామె నేర్చుకున్న కామ శాస్త్ర వేదాంతము

పురూరవుడామె కడకేగి
దీనముగ యాచించినాడు 
అపుడూర్వశి తన మనస్సులో 
వీనిని గురించి యున్న 
నిజమైన భావమును బైటపెట్టినది
అది యిది.. 
మగువలకు నింత లొంగెదు

''మగవాడవె నీవు పశువు మాడ్కిన్ వగవన్
దగవే .మానుష పశువును
మృగములు గని రోయుగాక మేలని తినునే''

ఈతలపామెకీనాడు కలిగినది కాదు 
పురూరవుని జూచిన నాడే యేర్పడినది
ఆ భావమునింతవరకు దాచినది. 

ఆ తరువాత నా మె తన కుల ధర్మము 
నీరీతి వెల్లడించెను

''తలపుల్ చిచ్చులు మాటలుజ్జ్వల సుధాధారల్ విభుండైన పూ
విలుతున్ మెచ్చర యన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు క్రూ
రలు తోడన్ బతినైన చంపుదు రధర్మల్ నిర్దయల్ చంచలల్
వెలయాండ్రెక్కడ వారి వేడబములా వేదాంత సూక్తంబులే''

ఊర్వశీ పురూరవుల ప్రేమలో 
పురూరవుడు ప్రేమైకవశుడు. 
కడుంగడు దీనుడు గూడ.. 

ఆ దేవకాంత 
వానితో నెప్పుడును సేవ జేయించుకొన్నదే గాని
వాని కొకనాడైనను 
సేవ జేసినట్లు గానరాదు

ఇది యనుకూల పతిక
ప్రౌఢ నాయిక

దుష్యంతుడు వేటకు బోయెను 
ఆశ్రమమునందు 
శకుంతల యొక్కతియ యున్నది
ఆశ్రమమున బ్రవేశించిన 
దుష్యంతునకా మె కంటబడినది

''దట్టపు దురు ము .. 
మిఱు మిఱు చూడ్కులు .. 
నట్టాడు నడుము.. ''

దుష్యంతున కింకేమి గావలెను..?
వెంటనే యతడు 
తన మనస్సును బైట పెట్టినాడు

ఆమెకును 
దుష్యంతుని జూచిన వెంటనే మతివోయినది
ఇంతలో మన్మధుడొకడు నడుమ దూరెను 
వాడు 
గుసుమాస్త్రములతో నా బాలను గొట్టినాడట 
శకుంతల తాలిమి సెడి 
ఇట్లు బదులు వలికినది.. 

''అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూ భర్తమున్
గనిరా మేనక డించిపోయె నడవిన్ గణ్వుండు నన్నింతగా
మనిచెన్ సర్వము నామునీంద్రు డురుగున్ మద్భాగధేయంబునన్
నిను గంటిన్ పిదపన్ గృతార్థనగుదున్ నేడీ వనాంతంబునన్''
 

శకుంతల ముగ్ధ ..
భావగోపన మింకను .. 

ఆమెకు బాగుగ నలవాటైనదిగాదు
 

ఊర్వశి తాను పురూరవుని ప్రేమించితినని 
నోరార చెప్పనేలేదు .. 
శకుంతల చెప్పినది..
ఆ చెప్పుట..  

'కృతార్థనగుదున్.. '
అని ఎంతో నాజూకుగా నన్నది
 

సత్కులమున బుట్టిన కన్యక
 ఇంతకంటె మరి యేమనును.. ?
 

పోతనామాత్యులు సృష్టించిన దేవయాని 
మహా గర్వోద్యమస్థాని
'భూరికోపానలాకలితగ్లాని' కూడ
 

ఆమె దృష్టిలో 
శర్మిష్ట తండ్రి శుక్రాచార్యునకు దాసుడు
తన చీర కట్టుకున్న శర్మిష్టను 

'విహితములే .. కుక్కలజు హవిర్భాగంబుల్.. '
యని యామె ప్రశ్నించు చున్నది
 

శర్మిష్ట గూడ కోపమున తక్కువదిగాదు .. 
 కాని యాకోపము క్షణమాత్రము
శర్మిష్ట దేవయానికి దాసియైనది
 

దానికి కారణము తండ్రి యాజ్ఞ 
అపుడామె 'చలమింకేల పోనీలె మ్మ' ని 

తన్ను తాను సవరించుకొన్నదట
ఆ సవరింపు 

తన కార్యమును సాధించుకొనుటలో దీక్షయే
 

ఎడరువేచి 
ఒకానొక నాడు యయాతిని లోగొన్నది
దేవయానికాసంగతి తెలిసి 

క్రోధమూర్చిత యైనది
యయాతి భంగపడినాడు 

ఆమె విన్నదిగాదు
యయాతి యపరాధము 

శుక్రుని చెవులకు తాకనేతాకినది 
శర్మిష్ట క్షత్రియ కాంత
కుచితమైన భావగోపనముగల యువతి
దేవయానికి 

తోచిన భావము దాచికొను నలవాటులేదు

సాధారణ కవులు 

అంగిక శృంగారమును వర్ణించి తృప్తి చెందుదురు
ఇతడును స్త్రీల యంగములను వర్ణించును
 

కాని .. దానికన్నను..  
స్త్రీల చేష్టలు .. విలాసములు .. వర్ణించుట పోతనామాత్యులకు ప్రియమైన పధ్ధతి.